Friday, April 26

Download Our App Now

Special Article: STOP LIQUOR  

మద్యంతో అనారోగ్యము – అవగాహన:

మద్యం మనిషికి శత్రువు. మన ఆరోగ్యానికి శత్రువు. మన శరీరంలోని చాలా అవయవాలకు శత్రువు. ముందు మద్యం మనం తాగుతున్నామనుకుంటాం. కానీ ఒక దశకు చేరిన తర్వాత అది మనల్ని మింగేయటం ఆరంభిస్తుంది. ఒళ్లంతా కబళించటం మొదలుపెడుతుంది. ఈ అవగాహన పెరిగితే.. కొందరైనా మద్యానికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తారన్న ఆశ.

మద్యం తీసుకుంటే ఆరోగ్యం సంపూర్ణంగా దెబ్బతింటుంది. లివర్‌ ఒక్కటే కాదు.. శరీరంలోని దాదాపు అన్ని అవయవాలూ పడకేస్తాయి.. మనల్ని ముంచేస్తాయి.

ప్రశాంతత.. ఓ భ్రమ!

చాలామంది తాగితే ‘హాయిగా’ ఉంటుందని, ఆందోళనలన్నీ తగ్గిపోతాయనీ, ఆత్మవిశ్వాసం పెరిగినట్లుంటుందని, బాధలన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుందనీ.. ఇలా రకరకాల కారణాలతో తాగుతుంటారు. ఇక్కడ మర్చిపోతున్న అంశమేమంటే- ఎక్కువగా తాగేవారిలో వ్యసనాలే కాదు, మానసిక సమస్యలు, వ్యాధులు కూడా ఎక్కువే. దీర్ఘకాలం మద్యం తాగటం వల్ల మెదడులోని రసాయనాల్లో మార్పులు వస్తాయి.

అతిగా తాగేవారిలో ఆందోళన, కుంగుబాటు చాలా ఎక్కువ. ఆత్మహత్య భావనలు, తమకు తాము హాని చేసుకోవటం వంటివీ ఎక్కువే. కొన్ని వారాల పాటు మితిమీరి తాగుతుంటే మానసిక భ్రాంతులు, ఎవరో మనకు హాని చేయబోతున్నారన్న భ్రమల వంటివి (సైకోసిస్‌) పెరుగుతాయి.

అతిగా తాగే అలవాటున్న వారు ఒక్కసారిగా మానేసినా.. తీవ్రస్థాయి మానసిక సమస్యలు తలెత్తవచ్చు. మద్యం వల్ల జ్ఞాపకశక్తి, మెదడు పనితీరు కూడా దెబ్బతింటాయి. ముఖ్యంగా మెదడు 18, 19 ఏళ్ల వరకూ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ వయసులో మద్యానికి బానిసైతే దాని ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుంది.

బానిస వ్యసనం

తాగకుండా ఉండలేకపోవటం, ఎంత తాగుతున్నామన్న దానిపై నియంత్రణ కోల్పోవటం.. ఇది మద్యం వ్యసనానికి బానిస అవుతున్నామని చెప్పే సంకేతం! దీనికి అనేక రకాల కారణాలు ఉండొచ్చు.

ఇంట్లో వాతావరణం, అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడి ఉండే కొన్ని వృత్తులు, లేదా సరదాగా సామాజిక సంబంధాల కోసం (సోషల్‌ డ్రింకింగ్‌) తాగాల్సి వస్తుండటం.. ఇవన్నీ కూడా వ్యసనాన్ని పెంచేవే. దీనికి బానిస కావటం వల్ల జరిగే చేటు: ఆందోళన, కుంగుబాటు, ఆత్మహత్య భావనలు పెరగటం వంటి మానసిక సమస్యల్లో కూరుకోవటంతో పాటు నిద్రలేమి, లైంగిక సామర్థ్యం తగ్గటం, జ్ఞాపకశక్తి తగ్గటం వంటివీ వేధిస్తాయి.

ఆటలకు దెబ్బ: మద్యం వల్ల క్రీడా సామర్థ్యం తగ్గుతుంది, వ్యాయామం సరిగా చేయలేరు. కాస్త ఎక్కువగా తాగినా యుక్తాయుక్త విచక్షణ పోయి నిర్ణయాలు తీసుకోవటం కష్టమవుతుంది.

సంతాన నష్టం: స్త్రీపురుషులు ఇరువురిలోనూ కూడా మద్యం సంతాన సామర్థ్యాన్ని, లైంగిక పటుత్వాన్ని తగ్గించేస్తుంది. ఎన్నో అధ్యయనాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. అతిగా మద్యం తాగితే టెస్టోస్టిరాన్‌ స్థాయులు తగ్గి.. పురుషుల్లో వాంఛలు తగ్గుతాయి, వీర్యం నాణ్యత తగ్గుతుంది. అయితే మద్యం మానేస్తే ఇవన్నీ సర్దుకుంటాయి.

 

నిద్ర భగ్నం: నిద్రకున్న ముగ్గురు శత్రువుల్లో మద్యం పెద్ద శత్రువు. కాఫీ/కెఫీన్‌, పొగతో పాటు మద్యం కూడా నిద్రను దెబ్బతీస్తుంది. మద్యం వల్ల ఒంట్లో నీరు ఎక్కువగా బయటకు పోతుంది. దీనివల్ల మధ్యరాత్రి టాయ్‌లెట్‌కు వెళ్లాల్సి వస్తుంది. గుండెల్లో మంట, గురక వంటివీ పెరుగుతాయి.

ప్రమాదాలకు దారి: పని ఎగ్గొట్టేవారిలో 20%, ఫ్యాక్టరీల వంటి పని ప్రదేశాల్లో సంభవించే ప్రమాదాల్లో 40% కేవలం మద్యం వల్లేనని గుర్తించారు. ఇక మద్యం కారణంగా సంభవించే రోడ్డు ప్రమాదాల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే. మద్యం వల్ల మెదడు చురుకుదనం తిగ్గి, వేగంగా స్పందించే లక్షణం దెబ్బతింటుంది. తలకు మెదడుకు గాయాలయ్యే తీవ్రస్థాయి ప్రమాదాల్లో 15-20% వరకూ కేవలం మద్యం కారణంగానే సంభవిస్తున్నాయి.

 

ఇంట్లో చిచ్చు: మద్యం తెచ్చిపెట్టే అతిపెద్దసమస్య.. అందరికీ తెలిసిన సమస్య.. కుటుంబాలు విచ్ఛిన్నం కావటం! సంసారాలు వీధిన పడటం! భార్యల పట్ల హింసాత్మకంగప్రవర్తించే భర్తల్లో 85% మంది మద్యానికి బానిసలైనవారే. మద్యం తగ్గించేలా చూస్తే గృహహింస కేసులు పదోవంతు తగ్గిపోతున్నాయని గుర్తించారు. మద్యం అలవాటు వల్ల అప్పులు పెరిగిపోవటం, పిల్లల చదువులు, ఇంట్లో తిండి వంటి వాటికి కూడా డబ్బుల్లేని దీనస్థితి తలెత్తే అవకాశాలు ఎక్కువ. మద్యం కారణంగా విడాకులకు వెళుతున్న జంటల సంఖ్య చాలా ఎక్కువ.

వ్యసనం – విముక్తి

** ఇంట్లో, ఆఫీసుల్లో ఎక్కడైనా మద్యం కళ్ల ముందు లేకుండా చూసుకోండి. కనబడకుండా ఉంటే మనసును తొలచకుండా ఉంటుంది.

** భోజనం మానకండి. అది మద్యానికి తలుపులు తెరుస్తుంది.

** మద్యానికి బానిసలమయ్యామనీ, దాని ముందు అశక్తులమైపోయామనీ నిస్సహాయంగా ఆలోచించటంగానీ, మాట్లాడటంగానీ చెయ్యద్దు.

** మానలేమని ముందే నిర్ణయానికి రావద్దు. ప్రయత్నం మానొద్దు.

** ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి.  రోజూ వ్యాయామం చెయ్యండి. ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే.. ఎంత వ్యాయామం చేస్తే.. ఆల్కహాల్‌ తాగాలన్న కాంక్ష అంతగా తగ్గిపోతుంటుంది.

** మద్యం వల్ల జీవితంలో ఎదురైన ఇబ్బందులు, కష్టనష్టాలు, దయనీయ ఘట్టాలను గుర్తుకు తెచ్చుకోండి.** మీ జీవితం నుంచి మద్యాన్ని తుడిచిపెట్టేస్తే.. మీలోని నిజమైన మనిషి, ఆ స్ఫూర్తి మరింతగా ప్రకాశించే అవకాశం ఉంటుంది. మద్యం మానేస్తే మీలో దాగున్న ప్రేమ, ప్రతిభ, చతురత వంటివన్నీ బయటపడతాయి.

**ఆల్కహాల్‌ వ్యసనాన్ని పోగొట్టటంలో ప్రత్యేకంగా తర్ఫీదు పొందినవారు సైకియాట్రిస్ట్‌లు. వ్యసనాన్ని వదిలించటానికి చాలా రకాల విధానాలున్నాయి. కాబట్టి మద్యం నుంచి బయటపడేందుకు సైకియాట్రిస్ట్‌ల సహాయం తీసుకోవటానికి సంకోచించవద్దు.

 

 

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »