Wednesday, February 20

Download Our App Now

Sankalpa’s Special Article on “Appendicitis”

అపెండిసైటిస్ అంటే ఏమిటి…..?

24 గంటల నొప్పి –  అపెండిక్స్‌… ఏ క్షణాన తిప్పలు తెచ్చిపెడుతుందోనని ప్రతి ఒక్కరికీ భయమే. ‘అపెండిసైటిస్‌’ మన మనసుల్లో అంతటి భయాన్ని సృష్టించింది.

నిజానికి అపెండిక్స్‌ నొప్పి అంత ఇబ్బందికరమైనదే. ఎందుకంటే దీన్ని అనుమానించటం తేలిక. కానీ కచ్చితంగా నిర్ధారించుకోవటం కష్టం. ఒకవేళ నిర్ధారించినా వెంటనే ఆపరేషన్‌ అవసరమా? కాదా? అన్నది తేల్చి చెప్పటం మరో ఇబ్బంది. అయితే ఒకప్పటి కంటే ఇప్పుడు ఈ అపెండిక్స్‌ పై మన అవగాహన చాలా పెరిగింది.

నొప్పికి మూలం.. రెండు రకాలు!

* అపెండిసైటిస్‌… ఈ ఉండుకం నొప్పి ప్రధానంగా రెండు రకాలుగా రావచ్చు.

  1. అబ్‌స్ట్రక్టివ్‌: అంటే పేగుల్లోని మలంగానీ, నులిపురుగుల వంటివిగానీ ఈ ఉండుకం మార్గానికి అడ్డుపడొచ్చు. అప్పుడు ఉండుకంలో తయారయ్యే మ్యూకస్‌ స్రావాలు బయటకు రావటం కష్టమవుతుంది కాబట్టి లోపలే ఉబ్బి.. వాపునకు కారణమవుతుంది.
  2. ఇన్‌ఫెక్టివ్‌: మనం తీసుకున్న ఆహారం, నీటి ద్వారా బ్యాక్టీరియా వంటివి పేగుల్లోకి చేరి.. అక్కడ్నుంచి ఉండుకంలోకి ప్రవేశించి, ఇన్‌ఫెక్షన్‌కు దారితియ్యచ్చు.

 

నొప్పి లక్షణాలు ముఖ్యం

అపెండిసైటిస్‌ సమస్య… ప్రధానంగా కడుపు నొప్పితో ఆరంభమవుతుంది. తర్వాత జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవటం.. ఈ నాలుగూ ప్రధాన లక్షణాలు. అపెండిసైటిస్‌ను నిర్ధారించటంలో ఈ లక్షణాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.

* నొప్పి: అపెండిసైటిస్‌ నొప్పి తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ముందు బొడ్డు దగ్గర, బొడ్డు చుట్టూ వస్తుంది. క్రమంగా సమయం గడుస్తున్న కొద్దీ ఉండుకం ఉండే చోటు అయిన కుడివైపు పొత్తికడుపు భాగానికి (రైట్‌ ఇలియాక్‌ ఫోజా) మళ్లుతుంది. అందుకే దీన్ని ‘షిఫ్టింగ్‌ పెయిన్‌’ అంటారు. బొడ్డు దగ్గర ఆరంభమైన నొప్పి సుమారు 6-8 గంటల తర్వాత ఇలా కడుపు కింది భాగానికి చేరుకుంటుంది. దీన్ని అపెండిసైటిస్‌ ప్రత్యేక లక్షణంగా చెప్పుకోవాలి. ఈ నొప్పి ఇలా మారటానికి కారణం- పొట్టలో ప్రధాన నాడులన్నీ బొడ్డు దగ్గర కేంద్రీకృతమవుతాయి కాబట్టి.. కడుపులో ఎక్కడ సమస్య తలెత్తినా ముందు బొడ్డు దగ్గరే నొప్పి ఆరంభమవుతుంది. ఇక ఇన్ఫెక్షన్‌ ముదిరి, వాపు పెరిగిన కొద్దీ క్రమేపీ ఉండుకం ఉండే దగ్గరే నొప్పి ఎక్కువగా తెలుస్తుంటుంది.

 

* జ్వరం: నొప్పి ఆరంభమైన తర్వాత జ్వరం వస్తుంది. ఇది ఎప్పుడూ 100.4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ కన్నా ఎక్కువగా ఉంటుంది. మధ్యమధ్యలో తగ్గటమన్నది ఉండదు.. జ్వరం ఎప్పుడూ ఒకేలాగ ఉంటుంది.

 

* వాంతులు: కొందరిలో ఒకట్రెండు వాంతులు అవుతాయి. కొందరిలో అవీ ఉండకపోవచ్చు కూడా. ఈ వాంతులు పేగుల్లో అవరోధాల మూలంగా వచ్చేవి కావు. నాడుల్లో స్పందనల మూలంగా వస్తాయి. అందుకే వీటిని ‘రిఫ్లక్స్‌ వామిటింగ్స్‌’ అంటారు.

 

* ఆకలి లేకపోవటం: అపెండిసైటిస్‌ అనేది పేగులకు సంబంధించిన సమస్య కాబట్టి ఆకలి తగ్గిపోయి ఆహారం సయించదు. – ఈ లక్షణాలు కనబడినప్పుడు అపెండిసైటస్‌ అని అనుమానించాలి.

 

వైద్యులేం చూస్తారు?

ఇవాళ ఎన్నో రకాల అత్యాధునిక పరీక్షా విధానాలు అందుబాటులోకి వచ్చాయి. అయినా అపెండిసైటిస్‌ను నిర్ధారించే విషయంలో వైద్యులు స్వయంగా చేసే పరీక్షకు ఎంతో ప్రాధాన్యం ఉంది. వైద్యుల పరీక్షతో దీన్ని తేలికగానే గుర్తించగలుగుతారు. దాన్ని నిర్ధారించుకునేందుకుఆల్ట్రాసౌండ్‌ పరీక్ష, రక్తపరీక్షలు చేయిస్తారు. వీటితో కచ్చితంగా నిర్ధారించటం సాధ్యమవుతుంది.

తేల్చిచెప్పే ఆల్ట్రాసౌండ్‌

* ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో అపెండిక్స్‌ వాపును కచ్చితంగా గుర్తించొచ్చు. నిజానికి వాపులాంటి సమస్యలేమీ లేకుండా అపెండిక్స్‌ ఆరోగ్యంగా ఉంటే ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో కనిపించటం కష్టం. అపెండిక్స్‌ వాచినపుడు అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక అపెండిక్స్‌ గోడ మందంగా కూడా మారినట్టు తెలుస్తుంది. దీని మందం 6 ఎం.ఎం. కన్నా ఎక్కువుంటే అపెండిక్స్‌ వాచిందని అనుమానం, 9 ఎం.ఎం. కన్నా ఎక్కువుంటే కచ్చితంగా వాపేనని నిర్ధారణ చేస్తారు. అపెండిక్స్‌ చుట్టూ చీము లేదా ద్రవం ఏవన్నా చేరి ఉన్నాయా అన్నదీ (పెరీ ఎపెండిక్యులర్‌ కలెక్షన్‌) తెలుస్తుంది. వీటితో చాలా వరకూ అపెండిసైటిస్‌ అని కచ్చితంగా తెలిసిపోతుంది.

సహాయపడే రక్తపరీక్షలు: అపెండిక్స్‌ వాచినపుడు రక్తంలో తెల్లకణాలు (డబ్ల్యూబీసీ) అధిక సంఖ్యలో ఉంటాయి. నొప్పితో పాటు క్యూబిక్‌ మిల్లీలీటర్‌ రక్తంలో 10 వేల కన్నా ఎక్కువ తెల్లకణాలుంటే అపెండిసైటస్‌ అని భావించొచ్చు. ఈ తెల్లకణాల్లోనూ న్యూట్రోఫిల్స్‌ సంఖ్య 70 శాతం కన్నా ఎక్కువుంటాయి. ఇక సీ-రియాక్టివ్‌ ప్రోటీన్‌ 6 కన్నా ఎక్కువుంటే ఇన్‌ఫెక్షన్‌ ఉన్నట్టు అర్థం.

చికిత్స ఏమిటి?

వైద్యుల పరీక్ష, ఆల్ట్రాసౌండ్‌లలో అపెండిక్స్‌ వాచినట్టు స్పష్టంగా నిర్ధారణ అయితే నేరుగా ఆపరేషన్‌కు వెళ్లిపోవటం మంచిది. ఒకవేళ ఆల్ట్రాసౌండ్‌ ఫలితం స్పష్టంగా లేకపోతే.. రక్తపరీక్ష ఫలితాలను చూస్తారు. అప్పటికీ ఉండుకం నొప్పేనా? కాదా? అన్నది స్పష్టంగా తేలక అనుమానంగా ఉంటే బాధితులను ఆసుపత్రిలో చేర్చి జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. నొప్పి తీవ్రంగా లేకపోయినా, ఆల్ట్రాసౌండ్‌ పరీక్షలో స్పష్టంగా కనిపించకపోయినా, రక్తంలో తెల్లకణాలు అంత ఎక్కువగా లేకున్నా.. యాంటీబయాటిక్‌ మందులతో చికిత్స చేయొచ్చు. ఈ సమయంలో ఎటువంటి ఆహారం ఇవ్వకుండా సెలైన్‌ ఇస్తారు. దీంతో పేగులకు పూర్తి విశ్రాంతి లభిస్తుంది. ఇలా 24-48 గంటల్లో అపెండిక్స్‌ వాపు లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అప్పుడు తిరిగి పరీక్షించి మందులతో చికిత్స చేయాలా? ఆపరేషన్‌ చేయాలా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ ఇన్‌ఫెక్షన్‌ తగ్గకుండా నొప్పి పెరుగుతూ అపెండిక్స్‌ వాపు లక్షణాలు స్పష్టమవుతుంటే ఆపరేషన్‌ చేయాల్సి ఉంటుంది.

* అపెండిక్స్‌ వాచినట్టు ఒకసారి గుర్తిస్తే ఆపరేషన్‌ చేసి తొలగించటం తప్ప మరో మార్గం లేదు! వాపును మందులతో తాత్కాలికంగా తగ్గించినా కొద్దిరోజుల తర్వాత అది తిరిగి వాచే అవకాశం ఉంటుంది. కాబట్టి సర్జరీ చేయటం ఉత్తమం.

* అపెండిసైటస్‌ అని నిర్ధారణ అయ్యి, నొప్పి తీవ్రంగా ఉంటే.. సాధ్యమైనంత త్వరగా.. 24 గంటల్లోపే సర్జరీకి వెళ్లటం ఉత్తమం. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లో సమయం వృథా చేసినకొద్దీ అది పగిలి.. అందులోని చీము, మలం పొట్ట అంతా అవ్వచ్చు. దీంతో ప్రాణానికీ ప్రమాదం ముంచుకొస్తుంది. ఒకవేళ ఆపరేషన్‌ చేసి అదంతా శుభ్రంగా కడిగినా కూడా.. పేగులు అతుక్కుపోయే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అది స్పష్టంగా అపెండిసైటిస్‌ అని తేలితే ఆపరేషన్‌కు వెళ్లటం.. అనుమానంగా ఉంటే ఉండుకాన్ని కాపాడటానికి మందులతో ప్రయత్నించటం మంచిది.

నొప్పులన్నీ ఉండుకానివే కావు!

పొట్టలో కుడివైపు వచ్చే నొప్పులన్నీ ఉండుకం నొప్పులే కాకపోవచ్చు. ఎందుకంటే ఇతరత్రా ఎన్నో సమస్యల్లో కూడా నొప్పి ఇలాగే ఉండొచ్చు. ముఖ్యంగా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు.. నీళ్ల విరేచనాలు పట్టుకున్నప్పుడు.. మూత్రపిండాల్లో ఇన్ఫెక్షన్‌ వచ్చినప్పుడు.. పొట్టలోని లింఫ్‌ గ్రంథులు వాచినప్పుడు.. ఆడపిల్లల్లో పొత్తికడుపు వాపు (పీఐడీ) సమస్యలో.. కాలేయంలో చీము వంటి సమస్యలు తలెత్తినప్పుడు.. చివరికి కుడివైపు వూపిరితిత్తి కింది భాగంలో న్యూమోనియా వచ్చినపుడు కూడా… నొప్పి ఇలాగే ఉండొచ్చు. అందుకే అది ‘అపెండిసైటస్‌’ నొప్పేనని నిర్ధారించే ముందు వైద్యులు ఒకటికి రెండుసార్లు తరచి చూస్తారు!

ఆపరేషన్‌ రెండు రకాలు

అపెండిక్స్‌ను తొలగించటానికి రెండు రకాల ఆపరేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఒకటి పొట్టమీద కోతపెట్టి చేసేది, రెండోది పొట్ట మీద రంధ్రాలు వేసి వాటిద్వారా కెమేరా గొట్టంతో ఉండుకాన్ని తొలగించే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతి. రెండూ సమర్థమైనవే. కాకపోతే ల్యాప్రోస్కోపిక్‌ పద్ధతిలో చేస్తే త్వరగా కోలుకుంటారు. కండరాలను పెద్దగా కొయ్యాల్సిన పని ఉండదు కాబట్టి కండరాల నొప్పి అంతగా ఉండదు. త్వరగా లేచి తిరుగుతారు.

డా|| కొండేటి మధుసూదన్ రావు

మేనేజింగ్ డైరెక్టర్

Please follow and like us:
20

More from my site

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »